వేసవిలో జరిగే అగ్నిప్రమాదాలపట్ల అవగాహన పెంచుకోవాలి
ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి
ములుగు, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి : వేసవికాలంలో జరిగే అగ్ని ప్రమాదాలపట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని, విద్యుత్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ కె.కుమారస్వామి సూచించారు. అగ్నిమాపక సేవా వారోత్సవాలలో భాగంగా గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఆవరణలో విద్యుత్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వల్ల సంభవించే ప్రమాదాలు ప్రజలకు ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ వేసవి తీవ్రతపట్ల ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. మనుషులు రక్షణ పొందడంతోపాటు అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ వైర్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, కెపాసిటీకి మించి లోడ్ ఉన్నట్లైతే విద్యుత్ అధికారులకు సూచించాల న్నారు. అదేవిధంగా వంటగ్యాస్ వినియోగించినప్పుడు వెంటిలేషన్ సక్రమంగా ఉంచుకోవాలన్నారు. తక్షణ చర్యలు, భద్రతా విధానాలపై ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.









