మావోయిస్టు రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం

On: April 7, 2026 9:09 PM

మావోయిస్టు రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం

DGP | మావోయిస్టు రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం

డీజీపీ శివధర్ రెడ్డి

కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ భవనాలకు శంకుస్థాపన

 గిరిజన అభివృద్ధికి చర్యలు వేగవంతం

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 7, తెలంగాణ జ్యోతి: మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్టలు పూర్తిగా మావోయిస్టుల రహిత ప్రాంతంగా మారాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ప్రకటించారు. మావోయిస్టు రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన డీజీపీ శివధర్ రెడ్డి పామునూరు ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు రహిత తెలంగాణ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని, గిరిజనుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గుత్తికోయ గిరిజనులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మావోయిస్టు రహిత తెలంగాణలో భాగంగా గిరిజనులకు జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. పామునూరుకు చెందిన ఏడు కుటుంబాలకు ఉమ్మడి ఉపాధి కోసం ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని అందజేయడంతో పాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇలాంటి చర్యల ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం లక్ష్యమన్నారు. కర్రెగుట్టల సహజ సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించే ఉద్దేశంతో పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యానికి అనుగుణంగా అటవీ, రెవెన్యూ, సీఆర్పీఎఫ్ మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 3000 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రాణాల కంటే ఏదీ మిన్న కాదని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని అన్నారు. ఈ సందర్భంగా 200 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేయడంతో పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వాహనదారుల ఆరోగ్య భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంతో భద్రతా చర్యలు మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యం, సంక్షేమంపై కూడా దృష్టి పెట్టుతున్నామని పేర్కొన్నారు. డీజీపీ బి. శివధర్ రెడ్డి పామునూరులోని సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌ను సందర్శించి జవాన్లతో ముఖాముఖి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో జవాన్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కర్రెగుట్టలు వంటి కొండ ప్రాంతాల్లో వ్యూహాత్మక పట్టు సాధించడానికి రాష్ట్ర పోలీస్, సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య సమన్వయం కీలకమని తెలిపారు. దీర్ఘకాలిక భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అనంతరం మొరమురు గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నర్సరీని డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర పీసీసీఎఫ్ సువర్ణతో కలిసి ప్రారంభించారు. అటవీ పెంపకంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ సమన్వయంలో జరిగిన ఈ పర్యటనలో పీసీసీఎఫ్ సువర్ణ, గ్రేహౌండ్స్ అదనపు డీజీపీ అనిల్ కుమార్, ఎస్ఐబి ఐజీపీ సుమతి, సీఆర్‌పీఎఫ్ ఐజీ విక్రమ్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టు రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!