ఇప్పగూడెం అక్రమ ఇసుక ర్యాంపు నిలిపివేయాలి: సిపిఎం డిమాండ్
వెంకటాపురం నూగూరు, మార్చి 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పగూడెం పరిధిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక ర్యాంపును వెంటనే నిలిపివేయాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడుతూ, గత ఏడాది ఇదే సమయంలో సర్వే నెంబర్లు 25, 26, 27లో ఉన్న లంక భూములకు అక్రమంగా పట్టాలు సృష్టించి ఇసుక ర్యాంపుకు అనుమతులు పొందినట్లు ఆరోపించారు. సుమారు 34 ఎకరాల 35 గుంటల భూమిలో గిరిజనేతరులకు పట్టాలు ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. 1975 నుంచి సుమారు 130 గిరిజన కుటుంబాలు సాగు చేస్తున్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ పట్టాలు పొందిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, సంబంధిత రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక ర్యాంపును తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కట్ల నరసింహాచారి, గొంది రమణయ్య, రైతులు కాంతారావు, వసంతు తదితరులు పాల్గొన్నారు.









