అసైన్డ్ భూములకు ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి
వెంకటాపురం నూగూరు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం జీపీ కొమరం భీం కాలనీలో ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ, ఐదవ షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వ భూములపై ఆదివాసీలకే పూర్తి హక్కు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసైన్మెంట్ జీవో అమలు చేసి, అర్హత కలిగిన ఆదివాసీలు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 76 సాదా బైనామాలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని గిరిజనేతరులు అక్రమం గా ఆదివాసుల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. సాదా బైనామా జీవో 76 ద్వారా గిరిజనేతరులకు భూములపై హక్కులు కల్పించకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 1996లో కొంతమంది ఆదివాసీలకే అసైన్మెంట్ చేసిన తరువాత ఇప్పటి వరకు కొత్త జీవో తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్ పరిధిలో కొంతమంది రెవెన్యూ అధికారులు ముడుపులకు ఆశపడి ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు కేటాయిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. వెంటనే అసైన్మెంట్ జీవో విడుదల చేసి, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి జి.ఎస్.పి ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షత వహించగా, కొమరం భీం కాలనీ ఆదివాసులు పాల్గొన్నారు.









