ఈనెల 28న ములుగులో జాతీయ లోక్ అదాలత్
కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలి
రాజీ ద్వారా కేసుల వేగవంత పరిష్కారం
ములుగు, మార్చి 26, తెలంగాణ జ్యోతి: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల మార్గదర్శకత్వంలో ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28 న (శనివారం) ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రాజీపడదగు క్రిమినల్, సివిల్, భూ వివాదాలు, మోటార్ వాహన ప్రమాద కేసులు, కుటుంబ మరియు వివాహ తగాదాలు, బ్యాంకు, ఇన్సూరెన్స్, ఎక్సైజ్ కేసులు, ప్రీ-లిటిగేషన్ అంశాలు తదితర కేసులను ఇరుపక్షాల అంగీకారంతో తక్షణమే పరిష్కరించే అవకాశం ఈ లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. సంబంధిత కక్షిదారులు తమ కేసుల వివరాలను ముందుగానే కోర్టులకు తెలియజేసి, తమ న్యాయవాదులతో కలిసి హాజరై రాజీ చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ విజయవంతం కోసం న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులు, బ్యాంకులు, చిట్ ఫండ్ ప్రతినిధులతో ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు లోక్ అదాలత్ ప్రయోజనాలను తెలియజేయడంలో మీడియా సహకారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞప్తి చేసింది.








