రామచంద్రపురం భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
మల్లంపల్లి, మార్చి 18,తెలంగాణ జ్యోతి : రామచంద్రపురం భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. కోరారు. మల్లంపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని సుమారు 10,500 ఎకరాల వ్యవసాయ భూముల రీ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గతంలో వివిధ కారణాల వల్ల పలువురు రైతులకు పట్టా పాస్‌బుక్స్ రాక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు వాటికి పూర్తి పరిష్కారం అందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు భూములను 9 బ్లాకులుగా విభజించి, 9 సర్వే బృందాలను ఏర్పాటు చేసి, రోజుకు 50 నుంచి 75 మంది పట్టాదారుల భూములను రీ సర్వే చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని వివరించారు. రీ సర్వే ప్రక్రియ విజయవంతం కావాలంటే గ్రామస్తులు, రైతులు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి, ఆర్డీవో వెంకటేష్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, రామచంద్రపురం, దేవనగర్, భూపాల్‌నగర్, గుర్తూరు తండా, శివతండా సర్పంచులు దొంతి స్వరూప, సంతోష్, రమణారెడ్డి, రాజు నాయక్, భాస్కర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






