ములుగులో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం స్వాధీనం
ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు జిల్లా కేంద్రంలోని మార్కెట్ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ములుగు మార్కెట్ సమీపంలో సయ్యద్ రఫీ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 28.55 క్వింటాళ్ల ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ములుగు ఎస్సై యు.ఉపేందర్ రావుకు అందిన నమ్మదగిన సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించగా ఈ బియ్యం బయటపడింది. సయ్యద్ రఫీతో పాటు జాకారం గ్రామానికి చెందిన ఇండ్ల శంకర్ కలిసి ములుగు మరియు పరిసర ప్రాంతాల్లో రేషన్ షాపుల నుంచి ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వ గోదాముకు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో రెండవ ఎస్సై బి. చంద్రశేఖర్‌తో పాటు సివిల్ మరియు టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.






