చిన్ననాటి స్నేహితుల ఘన సన్మానం
ములుగు, మార్చి 16 (తెలంగాణ జ్యోతి): ములుగు మున్సిపాలిటీలో 9వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గండ్రకోట వాణి కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ దంపతులకు వారి చిన్ననాటి పదవ తరగతి స్నేహితులు ఆత్మీయంగా ఘన సన్మానం నిర్వహించారు. 1991–92 విద్యా సంవత్సరంలో ములుగు ZPSS బాలుర ఉన్నత పాఠశాలలో కలిసి చదివిన పదవ తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమతో కలిసి చదువుకున్న మిత్రుడు గండ్రకోట కుమార్ ఈ స్థాయికి ఎదగడం ములుగు అభివృద్ధికి శుభసూచకమని వారు పేర్కొన్నారు. అలాగే మరో మిత్రుడు చింతనిప్పుల రవి కుటుంబానికి చెందిన చంద్రకళ బిక్షపతి మున్సిపల్ చైర్పర్సన్‌గా ఎన్నిక కావడం తమ అందరికీ గర్వకారణమని అభినందనలు తెలిపారు. ములుగును తెలంగాణలో అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని కోరగా, చైర్పర్సన్ చంద్రకళ మరియు కౌన్సిలర్ వాణి కుమార్ ములుగు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, గంగాధర్, విజేందర్, రవి శివరాజు, సదానందం పోషన్న, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, మల్లయ్య, ఆదిల్, సలీం తదితరులు పాల్గొన్నారు.






