అతివేగంతో అశోక్ లేలాండ్ బోల్తా – 10 మందికి గాయాలు
తాడ్వాయి, ఫిబ్రవరి 4, తెలంగాణ జ్యోతి : చర్ల నుంచి మేడారం వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం తాడ్వాయి మండలం పరిధిలో అతివేగం కారణంగా బోల్తా పడి ప్రమాదానికి గురైంది. కామరాం గ్రామాన్ని దాటి గిన్నెలవాగు బ్రిడ్జి సమీపంలోని మలుపు వద్ద వాహనం అధిక వేగంతో వెళ్లడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనం బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది ప్రయాణికుల్లో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే తాడ్వాయి ఎస్‌ఐ జగదీశ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీప దవాఖానకు తరలించి తక్షణ చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.






