బీసీల పట్ల కాంగ్రెస్ కపట నాటకం
– బిజెపి నాయకుల ధ్వజం
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : బీసీ కులాల పట్ల కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకమాడుతోందని బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురు వారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు పాగే రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూసాల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభను కామారెడ్డిలో నిర్వహించిన తీర్మానానికి కట్టుబడి, ఆ పార్టీ ఉండాలని ఆయన సవాల్ విసిరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, సంవత్సరం గడిచినా ఎక్కడ అమలు చేయలేదని బిజెపి నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు కోట్ల 70 లక్షల మంది జనాభా ఉండగా బీసీల జనాభా కోటి 64 లక్షల 9 వేలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించారని, అలాగే 10 శాతం ఉన్న ఓసిల జనాభా 15.89 లక్షలకు పెరగడం ఎలా సాధ్యమైందని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనార్టీల జనాభా 12.56 శాతం కాగా అందులో 10 శాతం బీసీల్లో చూపిస్తున్నారని ఆరోపించారు. బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎందుకు ప్రకటించడం లేదని వారు ప్రశ్నించారు. రిజర్వేషన్లు కాపాడుకునేందుకే ఓసి జనాభా 15.89 లక్షలు గా చూపెట్టారని వారు విమర్శించారు. బీసీల కు రిజర్వేషన్లు తగ్గించి, వారికి అనేక రంగాల్లో అన్యాయం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, ముస్లిం బీసీలు ఎక్కడి నుంచి వచ్చారని బిజెపి నాయకులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ మంత్రులు ముఖ్య మంత్రికి భజన చేస్తూ, తమ పదవిని కాపాడుకోవడం పైనే దృష్టి పెట్టారని, బీసీల సంక్షేమం గురించి వారికి శ్రద్ధ లేదని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల గణన సర్వేతో బీసీలకు ఒనగూరే లాభం ఏమీ లేదని కాటారం బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీసీలకు అన్యాయం చేస్తే తమ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ దుర్గం తిరుపతి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల కార్యదర్శి వేముల లింగయ్య, జిల్లా నాయకులు బొంతల రవి ముదిరాజ్, ఇంజాపూరి సదానందం తదితరులు పాల్గొన్నారు.