భారీ వర్షాలతో అతలాకుతలం
– ఉప్పొంగిపొర్లుతున్న జలపాతాలు.
– స్తంభించిన జనజీవనం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలలో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక కొండ వాగులు సైతం రికార్డ్ స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం నుండి ప్రారంభమైన భారీ, అతి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో జన జీవనం స్తంభించి పోయింది. ఖరీఫ్ వరి వ్యవసాయం, పొలాల పనులు వర్షాల కారణంగా నిలిచిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండ లంలో తెలంగాణ నయాగారగా పేరుగాంచిన బొగత జలపా తం ఉగ్రరూపం దాల్చింది. వెంకటాపురం, వాజేడు మండలా ల్లోని అనేక జలపాతాలు ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చాయి. అనేక కొండ వాగులు సైతం పొంగటంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆలుబాక, తిప్పా పురం బోదాపురం పంచాయతీ పరిధిలోని పెంకవాగు, సీతా రాంపురం, తిప్పాపురం, కలిపాక ఇంకా అనే ఇతర వాగులన్ని పొంగటంతో ఆయా అటవీ గ్రామాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. బుధవారం ఉదయం నుండి భారీ వర్షాలకు పాఠశాలలకు సైతం విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే వెంకటాపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్లో ప్రజల రాకపోకలు లేకపోవడంతో వెలవెల పోయింది.