పామాయిల్ సాగు పెంపుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
రైతులకు ఆత్మ చైర్మన్ రవీందర్ రెడ్డి పిలుపు
ములుగు, మార్చి 20, తెలంగాణ జ్యోతి: పామాయిల్ సాగు పెంపుకోసం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఆత్మ ములుగు డివిజన్ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి తెలిపారు. ములుగులోని రైతు వేదికలో ఆత్మ డైరెక్టర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జరిగిన సమావేశం లో మాట్లాడుతూ వ్యవసాయరంగంలో యాంత్రికరణను పెంచేందుకు జిల్లా స్థాయిలో త్వరలోనే వెయ్యి మంది రైతులతో కిసాన్ మేళా నిర్వహించ నున్నట్లు వెల్లడించారు. మండలాల వారీగా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు10 డ్రోన్లను కేటాయించిందని, వీటిని మహిళా సంఘాలు, రైతు ఉత్పాదక సంస్థలు (FPOలు), పిఎసిఎస్లకు రాయితీపై అందజేస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల విత్తనాలను 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆక్వా రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, చేపల చెరువుల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, ఇతర వర్గాలకు 40 శాతం సబ్సిడీ అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.






