అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలంటూ రాస్తారోకో
గిరిజన సొసైటీలను నిర్వీర్యం చేసే కుట్రలు
ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి
వెంకటాపురం, మే 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గోదావరిలో డీ-సిల్టింగ్ పేరుతో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం వందలాది మంది ఆదివాసీ మహిళలు, రైతులు, మత్స్యకారులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఆందోళనతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ సందర్భంగా ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ డీ-సిల్టింగ్ పేరుతో గోదావరిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం కోర్టు ధిక్కరణ కాదా అని ప్రశ్నించారు. ఇది పూడికతీత కాదని, గోదావరి గుండెకోత అని విమర్శించారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు ఎండిపోవడం, పంట భూములు నదిలో కలిసిపోవడం, వరద ముప్పు పెరగడం, చేపలు, తాబేళ్లు వంటి జలచరాల జీవావరణం నాశనం కావడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక గ్రామంలో ఉన్న పలువురు గిరిజన ఇసుక సొసైటీలలో ఒక్కదానికే అనుమతులు ఇస్తూ మిగతా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, పాత బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. తుడుందెబ్బ రాష్ట్ర మహిళా నాయకురాలు అట్టం సుభద్ర మాట్లాడుతూ ఆదివాసీల సహజ వనరులను కొల్లగొట్టే చర్యలను సహించబోమన్నారు. సమాచారం అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ ఆందోళన స్థలానికి చేరుకుని నాయకుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. డీ-సిల్టింగ్ను పూర్తిగా రద్దు చేయడం, పాత బకాయిల విడుదల, డీఎల్ఎస్సీ సమావేశం నిర్వహణ, 5 హెక్టార్ల లోపు రీచ్లకు జాయింట్ సర్వే చేపట్టడం, గ్రామసభ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి న్యాయపోరాటం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముర్రం రాజేష్, కుంజ మహేష్, మొడెం నాగరాజు, పద్మ, ముర్రం లక్ష్మి, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.









