Medaram | పెరుగుతున్న భక్త ప్రవాహం.. కళకళలాడుతున్న మేడారం…
– ఈసారి పూజలు మాత్రమే..
ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మినీ మేడారం సమ్మక్క -సారలమ్మలను దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. సమ్మక్క- సారమ్మ గద్దెల ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి కళకళ లాడుతోంది. గద్దెల చుట్టూ ఉన్న క్యూ లైన్ బారికేడ్లన్నీ నిండిపోయాయి. మేడారం వనదేవతల మండమెలిగే పండుగా (మినీ జాతర) సందర్భంగా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద అమర్చిన నల్లాలకింద్ స్నానాలు ఆచరించి, కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి సమ్మక్క సారలమ్మ పూనకాలతో తల్లులకు జేజేలు పలుకుతూ గద్దెలవద్దకు చేరుకున్నారు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా భక్తులు పోలీసు భద్రత నడుమ అమ్మవార్లకు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, చీర సారె, ఎత్తుబంగారం సమర్పించి ముక్కులు చెల్లించు కుంటున్నారు. మొన్నటి దాకా పంట పొలాలతో, పచ్చని బయళ్ళతో కళకళలాడిన మేడారం నేడు లక్షలాదిమంది భక్తులతో కిటకిటలాడుతూ దర్శన మిస్తుంది. అధికారులు అన్ని వసతులు కల్పించామని చెప్పినప్పటికీ లోటు కనిపిస్తున్నదని భక్తులు చెబుతున్నారు.
ఈ సారి పూజలు మాత్రమే..
గిరిజన సాంప్రదాయం ప్రకారం అమ్మవార్లను ప్రతీ రెండు సంవత్సరాలకొకసారి మాఘశుద్ద పౌర్ణమి రోజున గద్దెలపై ప్రతిష్ఠచేసి అమ్మవార్లను దర్శించుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు. అయితే ఇప్పుడు జరిగే జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. అమ్మవార్లు కొలువై ఉన్న ఆలయాలను, సామాగ్రిని శుబ్రపరిచి, మండమెలిగే పండుగను నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే పెద్ద జాతరకు వెళ్లొచ్చిన భక్తులు మినీ మేడారం పేరుతో ఇంటిలోనే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయేతే ఈ సారి మినీ జాతరకు సైతం తెలుగు రాష్ర్టాలతోపాటు చత్తీస్ ఘడ్, మహారాష్ర్ట, ఒరిస్సా, కర్ణాటక రాష్ర్టాలనుండి కూడా మహా మేడారం తరాహాలోనే భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని తరిస్తున్నారు.
1 thought on “Medaram | పెరుగుతున్న భక్త ప్రవాహం.. కళకళలాడుతున్న మేడారం…”