సింగిల్ టెండర్ ఇసుక విదానం వద్దు – ఇసుక క్వారీ సొసైటీ విదానమే ముద్దు.
– ఆదివాసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అట్టం సుభద్ర.
వెంకటాపురం నూగూరు, తెలంగాణా జ్యోతి : తెలంగాణలో సింగిల్ టెండర్ ఇసుక విధానం వద్దని, ఇసుక క్వారీ సొసైటీ విధానమే ముద్దని ఆదివాసి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అట్టం సుభద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత విదానం ద్వారా ఒక క్యూబిక్ మీటర్ ఇసుకకు ప్రభుత్వం ధర రూ. 650 కాగా, సొసైటీకి ప్రభుత్వం ఇచ్చే ధర రూ. 220గా ఉండేదన్నారు. నాటి విధానానికి ఆ రేటు సరిపోతుంది కానీ పెరిగిన ధరలకు పాత విదానం కారణంగా సొసైటీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సుభద్ర అన్నారు. నేటి కాంగ్రేస్ ప్రభుత్వం మళ్ళీ గతంలో ఉన్నట్టు, సింగిల్ టెండర్ ఇసుక విధానం తీసుకోస్తాం అని అంటుందని, దీనివల్ల దాదాపుగా 5లక్షల గిరిజన కుటుంబాలు ఆర్థిక ఇబ్బం దులు పడతారని, గిరిజన సొసైటీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ద్వారా ఒక క్యూబిక్ మీటర్ కు ప్రభుత్వం ధర 800 పెంచుతూ, గిరిజన సొసైటీలకు 600 రూపాయలు వెచ్చించించే విదంగా ప్రభుత్వ విధానం అమలు ఉండాలన్నారు. ఐటీడీఏ కొన్ని సొసైటీలను పైలెట్ ప్రాజెక్టులుగా తీసుకొని నిర్వహించి గిరిజనులకు వ్యాపారం పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర అక్రమ పట్టా భూములు,బినామిల పేరుతో, ఇసుక వ్యాపారం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందంటే గిరిజన చట్టాలను అపహాస్యం చేస్తున్నట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసా యనికి పనికి రాని భూములకు ఇసుక మేటల పేరుతో పర్మిషన్ ఇస్తున్న అగ్రికల్చర్ అధికారు లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగపేట మండలంలోని బోరు నర్సాపూర్ గ్రామంలో పట్టాభూములు గోదావరి ఒడ్డున ఉంటే గోదావరి నదిలో సుమారుగా 200 వందల మీటర్ల లోపలికి వెళ్లి ఇసుక తొలకాలు జరుపుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం, అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో దళారులు చెలరేగి పోతున్నారని ఆరోపిం చారు. వెంటనే అధికారులు స్పందించి పట్టా మేటల క్వారీ నీ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసిలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ,ఆదివాసీ సమాజమంతా ఒక్క తాటిపై నిలిచి ఆందోళనలు చేయక తప్పదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ములుగు జిల్లా ఆదివాసి మహిళా అధ్యక్షురాలు పాయం అనిత, నాయకురాళ్ళు ఈసం సరిత, భవాణి, ధీపిక, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.