ప్రజల అవసరాలను గుర్తించింది కేసీఆర్ సర్కారే
– పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజల అవసరాలను గుర్తించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంథని నియోజక వర్గంలోనీ కాటారం, మలహర్ రావు మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొన్నారు. ఆనాడు రైతులకు, ప్రజలకు కష్టాలు రాకుండా కేసీఆర్ చూశారని, ప్రతి పల్లెను ప్రగతిబాటలో నడిపించాలనే గొప్పగా ఆలోచన చేసి కార్యాచరణ చేసిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. అయితే పదేళ్లు గొప్పగా పరిపాలన చేసినా ప్రజలు మార్పు కోరుకున్నారని, ఆ మార్పుతో ప్రజలకు గోస తప్ప మేలు జరిగిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై కుట్ర పూరితంగా చేసిన విష ప్రచారాలతోనే ప్రజలు మార్పు కోరుకున్నారని ఆయన అన్నారు. ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్కార్ అప్పులు చేశారని అసత్య ప్రచారాలు చేస్తూ బదనాం చేస్తున్నారని, అయితే ఆ అప్పులు ప్రాజెక్టుల నిర్మాణాలకే అయ్యాయే కానీ ఎక్కడా ఒక్క పైసా దుర్వినియోగం చేయలేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేసి లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చా మన్నారు. అంతే కాకుండా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆస్పత్రుల నిర్మాణం చేశామని, పేద కుటుంబాలకు ఆడబిడ్డ కాన్పు బారం కావద్దని మాతా శిశు ఆస్పత్రులు నిర్మించామని ఆయన గుర్తు చేశారు. అదికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల ను మోసం చేసి అబద్దపు హమీలు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రైతులకు రైతుబంధు ఆపిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన విమర్శించారు. ఎన్నికల తర్వాత రైతు బందు ఇస్తామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంత మందికి రైతుబంధు వేశారని ఆయన ప్రశ్నించారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరిన్ని కష్టాలు తప్పవని అన్నారు. పార్లమెంట్‌లో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతునై కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి పథకాలు అమలు చేయిస్తానని, పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు.