పెద్ద చదువులు చదివితే సరిపోదు.. మాట్లాడటం నేర్చుకోవాలి..
త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ
సంక్షేమం అందిస్తున్న రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు తగదు
ఏనాడూ అసెంబ్లీకి రాని మాజీ సీఎం కేసీఆర్
వనదేవతలపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేదిలేదు
కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ
ములుగులో ప్రెస్ మీట్ లో రాష్ట్ర మంత్రి సీతక్క మండిపాటు
ములుగు, మే6, తెలంగాణ జ్యోతి : వరంగల్‌లో జరిగిన రైతు సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గర్హణీయమని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాందీ, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్రంగా విమర్శించార. పెద్ద చదువులు చదివితేనే సరిపోదని, వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవా లని డిమాండ్ చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల గురించి అవమానకరంగా మాట్లాడటం బాధాకరమన్నారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం రాజకీయ దురుద్దేశమని పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో రైతులను అప్పుల బారిన పడేసి, ధాన్యం కోతలు, ఎరువుల సమస్యలు, రుణమాఫీ ఆలస్యాలతో ఇబ్బందులకు గురి చేసిన వారు ఇప్పుడు రైతుల కోసం మాట్లాడటం విడ్డూరమన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, బోనస్‌లు, ధాన్యం సేకరణ, మక్కజొన్న కొనుగోలు కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పెన్షన్లు, సంక్షేమ పథకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయాలను ప్రజలు మరచిపోలేదన్నారు. రాహుల్‌గాంధీ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్న నాయకుడని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు, విష ప్రచారాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని కేటీఆర్‌కు హితవు పలికారు.









