గడ్డివాము దగ్ధం.. రైతుకు తీవ్ర నష్టం..
ములుగు, ఏప్రిల్ 15, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి గడ్డివాము దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. వీవర్స్ కాలనీకి చెందిన బైకాని కుమారస్వామి సుమారు మూడు ఎకరాల గడ్డి మంటల్లో కాలిపోయి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు. గుర్తు తెలియని దుండగులే అగ్నిప్రమాదానికి కారణమని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కోరాడు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.









