మేడిగడ్డకు సీఎం రాక ఖాయం.. జోరుగా సభ ఏర్పాట్లు…
కాటారం మండలం నస్తూరు పల్లి గ్రామంలో భారీ బహిరంగ సభ
మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో సమీక్ష
కాటారం, ఏప్రిల్15,తెలంగాణజ్యోతి: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 20న పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ప్రాజెక్టు పునర్నిర్మాణంపై నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించిన బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ బుధవారం కాటారం మండలం నస్తూర్ పల్లిలో పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు మౌలిక సదుపాయాలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ క్రమంలో ధన్వాడలోని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాసంలో కలెక్టర్, ఎస్పీలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించి, అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తరువాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు భద్రత, రవాణా, హెలిప్యాడ్, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, తహసీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ బాబు, కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, మహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు శ్రీనివాస్, మహేందర్, కిషోర్, తమాషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











