తీన్మార్ మల్లన్న ను కలిసిన బీసీ సంఘాల నేతలు
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి:జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం డివిజన్ కు చెందిన బీసీ సంఘ నేతలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను హైద్రాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేయతలపెట్టిన బీసీ కులగణనలో తలెత్తే ఇబ్బందులను, బీసీ సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అన్ని బీసీ సంఘాలు ‘రెడ్డి గాండ్ల’ కులస్థులు బీసీలు కాదని చేసిన పోరాటంలో భాగంగా, ఆనాటి ప్రభుత్వం వారు బీసీలు కాదని 2002 ఎన్ సీ బీ సి నం ఏ పీ 2002 , జీ ఓ నంబర్ 320/సి 2/2007 మరియు 2.8.2010 బీసీ కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ దాల్వా సుబ్రమణ్యం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రెడ్డి గాండ్ల కులస్థులు బీసీ లు కాదని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని, వారికి బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వద్దని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ వారు ప్రస్తుతం జరుగుతున్న కులగణనలో మళ్ళీ బీసీలుగా గుర్తించబడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్న రెడ్డి గాండ్ల కులస్థులు బీసీలు కాదని అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యతా రాగంతో ముందుకు వచ్చి చేస్తున్న పోరాటానికి బీసీ కులాల ఆపద్భాందవుడు, పేదల ఆశాజ్యోతి, పట్టభద్రుల శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలువడంతో అతను సానుకూలంగా స్పందించి, బీసీ కులాల పక్షపాతిగా న్యాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం కాటారం సబ్ డివిజన్ అధ్యక్షులు నిడిగొండ మైనర్ బాబు, కుమ్మరి సంఘం నాయకులు సముద్రాల తిరుపతి, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు విజయగిరి సమ్మయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు గడ్డం స్వామి, యాదవ సంఘం నాయకులు ఆత్మకూరి స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.