త్వరితగతిన చిన్న కాళేశ్వరం మరమ్మత్తు పనులను పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

Written by telangana jyothi

Published on:

త్వరితగతిన చిన్న కాళేశ్వరం మరమ్మత్తు పనులను పూర్తి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

తెలంగాణ జ్యోతి,కాటారం ప్రతినిధి : చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మహదేవ్ పూర్, కాటారం మండలాలలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. మొదటగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రాలతో సన్మానించారు. అనంతరం గోదావరి, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న వంతెనను పరిశీలించారు. బీరసాగర వద్ద జరుగుతున్న చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూడు పంప్ హౌస్ లు ఏర్పాటు చేయాల్సి ఉండగా రెండు పూర్తి అయ్యాయని, ఒకటి వచ్చే నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతు పనులతో పాటు ప్రత్యామ్నయంగా విద్యుత్ సరఫరా పురుద్దరణ పనులు చేపట్టాలని సూచించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎర్ర చెరువు, మందిరం చెరువు, కొత్త చెరువు పరిధిలోని దాదాపు 10 వేల అదనపు ఆయకట్టుకు సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఎర్ర చెరువు, మందిరం చెరువులను పరిశీలించి చెరువు అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు.కాటారం మండలం గారేపల్లి వద్ద కాళేశ్వరం రెండో దశ ఎత్తిపోతల పధకం పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ ద్వారా మహాదేవపూర్, కాటారం, మహా ముత్తారం, పలిమెల మండలాలలో దాదాపు 45 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. గారెపల్లి పంప్ హౌస్ 2 నుండి 13 చెరువులకు నీటిని అందించనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం పంటలకు సాగు నీరు అందించాలన్న ప్రభుత్వ లక్యం మేరకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 63 గ్రామాల రైతుల పంట పొలాలలకు సాగునీరు అందుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, అవసరమైన నిధులు కొరకు ప్రతిపాదనలు అందచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నీళ్లు వస్తే రైతులు సాగు చేయడానికి ధైర్యం వస్తుందని జాప్యానికి తావు లేకుండా నిరంతరాయంగా పనులు జరగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈ ఈలు యాదగిరి, తిరుపతిరావు, మహాదేవపూర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, కాటారం తహసీల్దార్ నాగరాజు, ఇరిగేషన్ ఏఈ విజయ్ కుమార్, మెగా ప్రాజెక్టు సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now