ఊరూర భోగి మంటలు – సంక్రాంతి సంబరాలు.
పిండి వంటల గుమగుమలు – హరిదాసుల సందడి.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : తెలుగు వారి సంస్కృతి సంప్రాదాయాలలో భాగంగా ముఖ్యమైన పండుగ నూతన సంవత్సరంలో సంక్రాంతి పండగ ప్రధానమైనది. అందులో భాగంగా సంక్రాంతికి వారం రోజులు ముందుగానే పండుగను ఘనంగా నిర్వహించు కునేందుకు పండగ ప్రణాళికలతో కుటుంబాలు వేడుకలను చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఆదివారం భోగిమంటలతో గ్రామ గ్రామాన సంక్రాంతి పండుగకు స్వాగత సన్నాహాలతో భోగి పండుగను అంగరంగ వైభవంగా ప్రతి ఊరు లో బోగి ఉత్సవాలతో, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో సంక్రాంతి పండగ సందర్భంగా వాలీబాల్, క్రికెట్ పోటీలు తో పాటు, మహిళలకు ముగ్గుల పోటీలను సైతం నిర్వహిస్తున్నారు. కొత్త అల్లుళ్లు, కొత్త కోడళ్ళుతో బంధుమిత్రుల పరస్పర శుభాకాంక్షలు తో, ఇంటిల్లిపాది పండగ వాతావరణంతో నూతన వస్త్రాలు ధరించి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అలాగే ప్రతి ఇంట పిండి వంటల గుమగుమలతో పండగను స్వాగతి స్తున్నారు. హరిదాసులు సాంస్కృతి సాంప్రదాయాలతో, ఇంటింటికి పండుగ పేరుతో కానుకలు స్వీకరిస్తున్నారు. గంగిరెద్దులు ఆటలు ఇతర వర్గాలు తో పండగ వాతావ రణానికి మెరుగులుతో అద్దంపడుతున్నాఇ. వెంకటాపురం మార్కెట్ లో వర్తక వ్యాపార సంస్థలు, బట్టల దుకాణాలు, బంగారపు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడు తున్నాయి. పట్టణాల నుండి వందలాదిమంది స్వగ్రామాలకు వాహనాలలో, బస్సులలో రావడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు కిటకిటలాడుతున్నాయి. పండుగకు రెండు మూడు రోజులు ముందే వ్యవసాయ కూలీలు సైతం పనులకు గణనీయంగా తగ్గిపోయారు. గ్రామ, గ్రామాన ఊరూర సంక్రాంతి సంబరాలు, భోగి మంటలతో గ్రామీణ క్రీడలు, ముగ్గుల పోటీలు , కోడిపందాలతో సంక్రాంతి సంబరాలు వెంకటాపురం, వాజేడు మండలాల్లో మిన్నంటాయి.