చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమీప గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరిక
వెంకటాపురం నూగూరు, మే 22, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ డివిజన్ సరిహద్దులోని చర్ల మండల పరిధి ఎదిర గుట్టలు, యాకన్నగూడెం–సుబ్బంపేట ప్రాంతాల సరిహద్దుల్లో చిరుత పులి సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టినట్లు వెంకటాపురం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. వంశీకృష్ణ శుక్రవారం మీడియాకు తెలిపారు. చిరుతకు సంబంధించిన అనుమానాస్పద పాదముద్రలు గుర్తించామని, అది సమీప అటవీ ప్రాంతాల వైపు కదులుతున్నట్లు భావిస్తూ వెంకటాపురం–చర్ల అటవీ విభాగ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. అడవి అంచు గ్రామాల ప్రజలు పశువులు, గొర్రెల మేపును తాత్కాలికంగా నిలిపివేయాలని, ప్రజలు ముఖ్యంగా పిల్లలు సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. చిరుత కనిపించిన పక్షంలో దానికి ఎలాంటి హాని చేయకుండా వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వెంకటాపురం–చర్ల ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎదిరా, యాకన్నగూడెం తదితర గ్రామాల్లో లౌడ్‌స్పీకర్ల ద్వారా జాగ్రత్త సూచనలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ చిరుత చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చిరుతకు సంబంధించిన సమాచారం ఉంటే 7569808435, 6281927840 నంబర్లకు వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు కోరారు.









