చిన్నగంగారంలో తాగునీటి కోసం గిరిజనుల ఆవేదన
బోరు మరమ్మతులు నిలిచిపోవడంతో 9 నెలలుగా తీవ్ర నీటి ఎద్దడి
వెంకటాపురం నూగూరు, మే 19, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ పరిధిలోని చిన్నగంగారం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. చిన్నగంగారంలో తాగునీటి కోసం గిరిజనుల ఆవేదన నెలకొనగా, గత తొమ్మిది నెలలుగా గ్రామపంచాయతీ బోరు మరమ్మతులకు గురై పనిచేయకపోవడంతో సుమారు 40 ఆదివాసీ కుటుంబాలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నూతన పంచాయతీ పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏప్రిల్ చివర్లో సమస్యపై మీడియాలో వార్తలు రావడంతో అధికారులు స్పందించి మోటారు మరమ్మతులు చేపట్టినా, పాత ఎలక్ట్రానిక్ స్టార్టర్ పనిచేయకపోవడంతో బోరు మళ్లీ నిలిచిపోయిందని తెలిపారు. దీంతో గ్రామస్తులు చేతి పంపులు, సమీప చెలిమెలపై ఆధారపడుతూ తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. గిరిజన సంక్షేమం గురించి ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ నూటికి నూరు శాతం గిరిజనులు నివసించే గ్రామంలో ఇంతకాలంగా నీటి సమస్య కొనసాగడం దురదృష్టకరమని గ్రామస్తులు మండిపడ్డారు. సమస్య వెంటనే పరిష్కరించకపోతే రాస్తారోకో, ధర్నా వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి గ్రామానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.









