ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం సహించం: భూక్య జంపన్న
ములుగు, మే 11, తెలంగాణ జ్యోతి : గురుకులాలు, వసతి గృహాల్లో కాంట్రాక్టు వ్యవస్థలో అమలులో ఉన్న జీవో నెంబర్ 17ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న సోమవారం ములుగు జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం అందజేశా రు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. గతంలో ఇచ్చిన రిజర్వేషన్ హామీలను అమలు చేయకుండా పేద వర్గాల కాంట్రాక్టర్లను వ్యవస్థ నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. జీవో 17 ద్వారా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పేరుతో సంపన్న వర్గాల కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. పాత టెండర్ విధానాన్ని కొనసాగిస్తూ జీవోను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.









