అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
బండారు రవికుమార్
వెంకటాపురం నూగూరు, మే 6, తెలంగాణ జ్యోతి: అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వరి ధాన్యాన్ని మిల్లర్లు ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలో కొప్పుల రఘుపతి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 3 నుంచి 6 కిలోల వరకు కటింగ్‌కు ఒప్పుకుంటేనే మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. 25 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం ఇప్పటికీ మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు అనంతరం వెంటనే రసీదులు ఇవ్వాలని, ప్రతి కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సూడి కృష్ణారెడ్డి, బిరెడ్డి సాంబశివ, తుమ్మల వెంకట్ రెడ్డి, రత్నం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.









