పాలెం ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ఆచూకీ తెలిసినవారు వెంకటాపురం పోలీస్ శాఖను సంప్రదించాలి
వెంకటాపురం నూగూరు, మే 06, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం ప్రాజెక్టు రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. ప్రాజెక్టు సమీపంలోని రాచపల్లి, మల్లాపురం గ్రామాల రైతులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి ప్రాజెక్టు సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం వెంకటాపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గిరిజన మత్స్యకారుల పడవలు, గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని రిజర్వాయర్ నుంచి వెలికి తీశారు. మధ్యవయస్కుడిగా భావిస్తున్న మృతుడి ఆచూకీ, చిరునామా ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే వెంకటాపురం పోలీస్ శాఖను సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.









