అక్రమ పశువుల రవాణాపై కట్టుదిట్టమైన నిఘా
చెక్పోస్ట్ ఏర్పాటు చేసి 24 గంటల తనిఖీలు
పస్ర ఎస్సై తాజుద్దీన్
గోవిందరావుపేట, మే 5, తెలంగాణ జ్యోతి: అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మంగళవారం గోవిందరావుపేట మండలం పస్రా ప్రాంతంలోని సోమలగడ్డ క్రాస్ వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఆదేశాల మేరకు, ములుగు డీఎస్పీ రవీందర్ సూచనలతో, సీఐ దయాకర్ పర్యవేక్షణలో ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 27న జరగనున్న బక్రీద్ పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని అక్రమ పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చెక్పోస్ట్ వద్ద 24 గంటల నిఘా కొనసాగిస్తూ అనుమానాస్పద వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మూగజీవాలను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పశువులను కబేళాలకు తరలించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.









