వెంకటాపురంలో ఘనంగా కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు
ఆర్యవైశ్యుల భక్తి శ్రద్ధల మధ్య కిటకిటలాడిన ఆలయం
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 26, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ పర్వదినాన్ని అధికారిక పండుగగా ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వాజేడు, వెంకటాపురం మండలాల ఆర్యవైశ్య సోదర, సోదరీమణులు కృతజ్ఞతలు తెలిపారు. వాజేడు, వెంకటాపురం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య పూజా కార్యక్రమాలు, శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించారు. వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు భారీగా తరలివచ్చి మంగళహారతులు, భక్తి గీతాలతో ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. సమస్త ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ జయంతి ఉత్సవాలలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.









