ఇండియా బ్లాక్ ఎంపీలకు అభినందనలు
131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు ప్రశంసలు
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు
వెంకటాపురం, ఏప్రిల్ 22, తెలంగాణ జ్యోతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి ఓటు వేసిన ఇండియా బ్లాక్ పార్టీల ఎంపీలకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. ఈ మేరకు వెంకటాపురంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుగా ప్రవేశపెట్టిన ఈ సవరణ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రయత్నించిందని ఆరోపించారు. గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా జనాభా నియంత్రణ చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు డిలిమిటేషన్‌లో నష్టపోకూడదని సీట్ల పెంపును నిలిపి వేశాయని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉత్తరాది రాష్ట్రాల సీట్లను పెంచి పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఈ కుట్రను ఇండియా బ్లాక్ పార్టీలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. ఈ సందర్భంగా ఇండియా బ్లాక్ ఎంపీలను ఏకం చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.









