ఆసుపత్రిలో అగ్ని భద్రతపై అవగాహన
ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి
ములుగు, ఏప్రిల్ 17, తెలంగాణ జ్యోతి: అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి కుమారస్వామి, సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా రక్షించు కోవాలి అనే అంశాలపై ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో విద్యుత్ సంబంధిత అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని, పాత వైర్లు, అధిక లోడ్ వినియోగం, నాణ్యతలేని పరికరాలు, నిరంతర వినియోగంలో ఉండే మెడికల్ ఉపకరణాల వలన షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ఒకే ప్లగ్‌లో అనేక పరికరాలు ఉపయోగించకూడదని, ఎలక్ట్రిక్ పరికరాలను నిరంతరం పరిశీలిస్తూ అనుమానాస్పద పరిస్థితులు గమనిం చిన వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా ముందుగా అలారం ఇవ్వడం, విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను వినియోగించడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోగులను సురక్షితంగా బయటకు తరలించడం అత్యంత ముఖ్యమని, నడవగలిగే రోగులను క్రమపద్ధతిలో, నడవలేని రోగులను స్ట్రెచర్, వీల్‌చైర్ లేదా సిబ్బంది సహాయంతో జాగ్రత్తగా తరలించాలని సూచించారు. లిఫ్టులను ఉపయోగించకుండా మెట్ల ద్వారానే బయటకు రావాలని, అవసరమైతే ప్రత్యేక పద్ధతులతో రోగులను తరలించాలని వివరించారు. కార్యక్రమంలో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించగా సిబ్బందిలో అగ్ని భద్రతపై చైతన్యం పెరిగింది.









