Tirumala | తిరుమల అన్నదాన పథకానికి 40 ఏళ్లు
రోజు-apple-systemకు లక్ష మందికి పైగా ఉచిత భోజనం
రూ.2,200 కోట్ల నిధితో భక్త సేవలో అన్నప్రసాదం ట్రస్ట్
వెంగమాంబ సంప్రదాయం నుంచి నేటి వరకు విశిష్ట ప్రయాణం
2 వేల మందితో మొదలై లక్షల మందికి విస్తరించిన మహత్తర పథకం
9.7 లక్షల దాతల సహకారంతో సాగుతున్న సేవా యజ్ఞం
తిరుమల, ఏప్రిల్ 7, తెలంగాణజ్యోతి: తిరుమలలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించే నిత్య అన్నదాన పథకం నేటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మహత్తర సేవకు మూలంగా నిలిచింది భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ సంప్రదాయం. తిరుపతికి వచ్చే భక్తుల కోసం ఆమె నిర్వహించిన అన్నదానం సాంప్రదాయాన్ని పునరుద్ధరించి, 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో తిరుమలలో నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభ దశలో మద్రాసుకు చెందిన ఎల్.వి. రామయ్య రూ.10 లక్షలు, మాన్ సింగ్ చారిటీస్ రూ.20 లక్షలు విరాళంగా అందించడంతో ఈ సేవకు బలమైన పునాది ఏర్పడింది. నాడు కేవలం 2 వేల మంది భక్తులతో ప్రారంభమైన ఈ పథకం, నేడు రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించే స్థాయికి ఎదిగింది. 2014లో ఈ పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ‘శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్’గా పేరు మార్చారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్ మూలనిధి రూ.2,200 కోట్లకు పైగా ఉండగా, 9.7 లక్షల మంది దాతలు ఇందులో భాగస్వాములయ్యారు. రోజుకు అన్నప్రసాదం పంపిణీకి సుమారు రూ.44 లక్షలు ఖర్చవుతున్నప్పటికీ, భక్తుల సహకారంతో ఈ సేవ నిరంతరం కొనసాగుతోంది. తిరుమలలో భక్తులకు ఆకలి తీరుస్తూ సాగుతున్న ఈ అన్నదాన పథకం, దేశంలోనే అత్యంత పెద్ద ఉచిత భోజన కార్యక్రమంగా నిలిచి, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తోంది.








