పంచాయతీ భవన నిర్మాణంపై పర్యవేక్షణ లోపం..!
లక్ష్మీపురం గ్రామస్థుల ఆందోళన
కన్నాయిగూడెం, ఏప్రిల్6, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండలం లక్ష్మపురం గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతు న్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 20 లక్షలతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై గ్రామస్తులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పనుల ప్రదేశానికి అధికారులు తరచూ రాకపోవడంతో పాటు పురోగతిపై ఎలాంటి సమీక్షలు నిర్వహించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతు న్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా క్రీడా ప్రాంగణంలో భవనం నిర్మాణంపై ఇప్పటికే వివాదం కొనసాగుతుండగా, ఇప్పుడు పర్యవేక్షణ లోపం మరింత అనుమానాలకు తావిస్తోంది. నాణ్యత లోపాలు ఉంటే భవిష్యత్తులో భవనం భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి పనులు నాణ్యతతో జరుగుతున్నాయో లేదో నిర్ధారించాలని, పారదర్శకంగా పనులు నిర్వహించి గ్రామ ప్రజల నమ్మకం పొందాలని వారు డిమాండ్ చేస్తున్నారు.









