ఆహార భద్రతలో రాజీ పడొద్దు : అదనపు కలెక్టర్ మహేందర్ జి
గడువు ముగిసిన పదార్థాలు కొనవద్దు
హోటళ్లపై కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు
ములుగు, ఏప్రిల్ 6, తెలంగాణ జ్యోతి: ప్రజలు ఆహార భద్రత నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల్లో ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే సందర్భంగా ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాణ్యమైన ఆహారం ద్వారానే మంచి ఆరోగ్యం సాధ్యమని పేర్కొంటూ, ఆహార ముడి పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో గడువు తేదీ, తయారీ తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. గడువు ముగిసిన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కొనరాదని హెచ్చరించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తాజా కూరగాయలు ఉపయోగించాలని, వంటగదులు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్వీట్ హౌస్ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందిగా పేర్కొంటూ, వాటిపై ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కఠినంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ వేణుగోపాలరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ జనార్ధన్ తదితర అధికారులు పాల్గొన్నారు.









