సూరవీడులో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు కోరుతూ వినతి
అంగన్వాడీ, పాఠశాల భవనాల నిర్మాణానికి కూడా విజ్ఞప్తి
వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 6 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా సూరవీడు గ్రామపంచాయతీలో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్ ఇర్ఫా మురళి సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ కొర్స మురళి కృష్ణతో కలిసి గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను వివరించారు. సూరవీడు మరియు సూరవీడు కాలనీలలో కొత్త అంగన్వాడీ భవనాలు, కె.కొండాపురంలో నూతన పాఠశాల భవనం నిర్మాణంతో పాటు సూరవీడు గ్రామపంచాయతీలో హెల్త్ సబ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. గ్రామ ప్రజలకు మెరుగైన ఆరోగ్య, విద్యా సౌకర్యాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.









