ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ : డా. కె. నారాయణ
ములుగు, ఏప్రిల్ 3, తెలంగాణ జ్యోతి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇంటింటా సీపీఐ’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డా. కె. నారాయణ తెలిపారు. శుక్రవారం ములుగు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సాధకబాధకాలను తెలుసుకుని పేదల ఇండ్లు, ఇండ్ల స్థలాలు, గుడిసె వాసులకు పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, సాగునీరు వంటి సమస్యలపై దృష్టి సారిస్తారని తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులను సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








