డ్రైవర్ల భద్రతపై ఉచిత కంటి శిబిరం
ప్రారంభించిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాటారం, మార్చి 24, తెలంగాణ జ్యోతి: భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్ల కోసం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని మంగళవారం సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ప్రారంభించారు. హన్మకొండకు చెందిన శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. డ్రైవర్లు తమ కంటి చూపును నిరంతరం పరీక్షించించుకుని అవసరమైన చికిత్స పొందాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ఓవర్‌టేకింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని హెచ్చరించారు. కంటి చూపు లోపాలు కూడా ప్రమాదాలకు కారణమ వుతాయని, రోడ్డుపై సూచనలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని పేర్కొన్నారు. శిబిరంలో సుమారు 300 మందికి పైగా ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.









