వాజేడు లో 1/70 ఉల్లంఘన
నాన్ ట్రైబుల్స్కు అక్రమ పట్టాలు
వెంకటాపురం నూగూరు, మార్చి 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలంలో ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులకు అక్రమంగా భూ పట్టాలు మంజూరు చేస్తున్నారని గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ ఆరోపించారు. మంగళవారం వాజేడు తాసిల్దార్కు మెమోరాండం అందజేసిన ఆయన, అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ చట్టాలను రెవెన్యూ అధికారులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. 1/59, 1/70 చట్టాల ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపులు చెల్లవని స్పష్టం చేశారు. ఈ చట్టాలు లేకపోతే ఆదివాసి ప్రజల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని, 1/70 చట్టం రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 1988లోనే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు ప్రభావశీలులు అధికారులను ప్రభావితం చేసి అక్రమ పట్టాలు పొందుతున్నారని ఆరోపించారు. వాజేడు మండలం ఏడుచర్లపల్లి (జెడ్) సర్వే నెంబర్ 91లో 8 ఎకరాలు, ముత్తారం (జి) సర్వే నెంబర్ 15/2లో 11 ఎకరాలు, 15/1లో 1.30 ఎకరాల భూములు గిరిజనేతరులకు ఎలా మంజూరు చేశారని అధికారులను ప్రశ్నించారు. అక్రమ పట్టాలు మంజూరు చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘ నాయకులు పూనెం మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.









