వారం రోజుల్లో రోడ్డు పక్క దుకాణాలు ఖాళీ చేయాలి
దుకాణదారులకు నోటీసులి చ్చిన గ్రామపంచాయతీ సిబ్బంది
వెంకటాపురం నూగూరు, మార్చి 24, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రధాన రహదారిని ఆనుకుని దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు గ్రామ పంచాయతీ మంగళవారం నోటీసులు జారీ చేసింది. రహదారి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను వారం రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. లేనిపక్షంలో పంచాయతీ చట్టం 2018 ప్రకారం ప్రజలకు, వాహనాలకు ఇబ్బంది కలిగించే దుకాణాలను అధికారులు స్వయంగా తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వెంకటాపురం మెయిన్ సెంటర్, బస్టాండ్ సెంటర్, చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో రోడ్డు పక్కనే కూరగాయలు, ఇతర వ్యాపారాలు నిర్వహించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాల రద్దీతో పాటు ఇసుక లారీల సంచారం కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ప్రజలు ఇటీవల గ్రామ సభలో ఫిర్యాదు చేశారు. శివాలయం నుంచి పెట్రోల్ బంకు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉండగా, వచ్చే ఏప్రిల్ నెలలో ఇందుకు నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ముందస్తుగానే వ్యాపారస్తులను ఖాళీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే కూరగాయల మార్కెట్, ఆటో స్టాండ్‌లకు ప్రత్యేక స్థలాలు కేటాయించాలని ప్రజలు, వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.









