గిరిజనేతరుల అక్రమ పట్టాలు రద్దు చేయాలి
వాడగూడెం సర్వే నం.116లో అక్రమాలపై జీఎస్పీ ఆగ్రహం
వెంకటాపురం నూగూరు,మార్చి23,తెలంగాణజ్యోతి:గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులకు అక్రమంగా ఇచ్చిన భూమి పట్టాలను వెంటనే రద్దు చేయాలని గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్ చేశారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో పూనెం మునేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం మండలం వాడగూడెం సర్వే నం.116లో ప్రభుత్వ భూమిని గిరిజనేతరుడికి 16 ఎకరాలు ఎలా పట్టా చేశారో అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి బ్యాంకు రుణాలు పొందుతూ లక్షల రూపాయల మేర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. 1/70 చట్టానికి విరుద్ధంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా, కలెక్టర్ మరియు ఆర్డీవో ఆదేశాలు ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మరికాల జెడ్ సర్వే నం.9లో కూడా అదే వ్యక్తి మరో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి బోరు వేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు పొందడమే కాకుండా రైతుబంధు, పీఎం కిసాన్ నిధులను కూడా అక్రమంగా పొందుతున్నారని, వాటిని వెంటనే రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ పట్టాలను రద్దు చేయకపోతే ఏప్రిల్ మొదటి వారం నుంచి వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బచ్చల దశరథం, కురుసం సందీప్, ఆలెం రవి తదితరులు పాల్గొన్నారు.









