లోకిని రాజు సేవలు అభినందనీయం
స్వర్ణ నంది అవార్డు ఎరుకల జాతికి గర్వకారణం
వెంకటాపూర్, మార్చి 23, తెలంగాణ జ్యోతి: పూలే, అంబేద్కర్ ఆలోచనలను ఆచరిస్తూ రాజ్యాంగ హక్కుల సాధన కోసం ఆదివాసి ఎరుకల పక్షాన నిరంతరం పోరాడుతున్న లోకిని రాజు సేవలు అభినందనీయమని ఆదివాసి ఎరుకల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు కేతిరి బిక్షపతి పేర్కొన్నారు. సోమవారం వెంకటాపూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోకిని రాజు సామాజిక సేవలను గుర్తించి ఆదివారం ఖమ్మం వేదికగా మొగిలి, ఎన్‌ఎస్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణ నంది ఉగాది పురస్కారాన్ని అందుకోవడం ఎరుకల జాతికి గర్వకారణమని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఆదివాసి తెగల సమస్యల పరిష్కారం కోసం అండగా నిలుస్తూ సేవలందిస్తున్న రాజుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎరుకల నాంచారమ్మ జాతరను గత ఎనిమిదేళ్లుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఎరుకల కులస్తులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రాజు చేస్తున్న సేవలకు గుర్తింపు రావడం సంతోషకరమని, మున్ముందు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎరుకల ఆత్మగౌరవాన్ని మరింతగా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లకొండ భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.









