ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం అందించాలి
మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడి
హామీలు అమలు చేయకపోతే 28న చలో హైదరాబాద్ హెచ్చరిక
ములుగు, మార్చి 20, తెలంగాణ జ్యోతి: ఆశా వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. ముందుగా డీఎల్ఆర్ గార్డెన్ నుంచి మంత్రి కార్యాలయం వరకు ర్యాలీగా బయలు దేరిన ఆశాలను బండారుపల్లి రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆశాలు క్యాంపు కార్యాలయం వరకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. నీలాదేవి మాట్లాడుతూ ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు 48 గంటల ధర్నాలు నిర్వహించి నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే మంత్రుల ఇండ్ల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చామని తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆశా వర్కర్లపై పనిభారం పెంచి తగిన వేతనం ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. సమస్యలు చెప్పినా అరెస్టులు, నిర్బంధాలు చేయడం తగదన్నారు. వ్యక్తులపై కాకుండా విధానాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు గ్రామాల్లో ఆరోగ్య సేవలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి తగిన వేతనం ఇవ్వాలని అన్నారు. అనంతరం మంత్రి సీతక్క కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన రవి గౌడ్‌తో పాటు ప్రభావతి, శోభ, చంద్రవాణి, దేవి, సంధ్య, పూర్ణ, మాధవి, అనిత, నాగమణి, సుధా, స్వరూప, పాప, రాజ్యలక్ష్మి, సత్యవతి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.






