వడగాలుల ముప్పుపై కూలీలకు అవగాహన
వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించిన వైద్యులు
వెంకటాపురం నూగూరు, మార్చి 20, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యవసాయ క్షేత్రాలలో డాక్టర్ తరుణ్ ఆధ్వర్యంలో శుక్రవారం వడదెబ్బ మరియు వడగాలులపై వలస కూలీలకు అవగాహన కల్పించారు. మిర్చి తోటల వద్దకు వెళ్లి వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలు వివరించారు. ముఖ్యంగా అయోమయం, గందరగోళం, ఆందోళన, మూర్చ, వేడి మరియు ఎరుపు చర్మం, తలనొప్పి, కండరాల బలహీనత, వాంతులు, హృదయ స్పందనలు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో తిరగరాదని, చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదని, ఆల్కహాల్, టీ, కాఫీ, గ్యాస్ పానీయాలు నివారించాలని తెలిపారు. దాహం లేకపోయినా తరచుగా నీరు తాగాలని, ఓఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకోవాలని, పుచ్చకాయ, కర్బూజా వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలని సూచించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం, తల కప్పుకోవడం అవసరమని తెలిపారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ తరుణ్, హెచ్‌ఈవో వేణుగోపాలకృష్ణ, హెచ్‌ఏ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






