విజన్ స్కూల్‌లో ముందస్తు ఉగాది వేడుకలు
వెంకటాపురం నూగూరు, మార్చి 18 తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని విజన్ స్కూల్‌లో బుధవారం ముందస్తు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను యువతరానికి తెలియజేసి నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, తెలుగు నూతన సంవత్సర విశిష్టతపై వివరణలు ఇస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ వేషధారణలో విద్యార్థుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు గౌరవం తీసుకొచ్చిన నవోదయ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన రామటెంకి శ్రేష్ట, కందుకూరి మేఘనలను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు బాహుబలేంద్రుని వెంకటరామా రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి విలువలను అలవరుచు కోవాలని, అదే నిజమైన విద్య లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చురుకుగా పాల్గొనగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తూ సహకరించారు. మొత్తం మీద ఈ వేడుకలు విద్యార్థుల్లో సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించేలా విజయవంతంగా నిర్వహించబడ్డాయి.





