అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్
ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ అంగన్వాడి కేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసియా షాహీన్ రియాజ్ మీర్జా, కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులు, హాజరు నమోదులు, స్టాక్ రిజిస్టర్, మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు చిన్నారులకు అందిస్తున్న పాలు, గుడ్లు మరియు ఇతర పోషకాహార నాణ్యతను సమీక్షించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకుని, చిన్నారులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన వారు పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే త్రాగునీరు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, వంటగది నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అవసరమైన మరమ్మత్తులు, ఆట వస్తువులు, సామగ్రి కొరత ఉంటే వెంటనే తెలియ జేయాలని సూచించారు. Ee కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లత, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.






