మేడారంలో బ్యాంకు ఏర్పాటు చేయాలి
– దారావత్ దేవా నాయక్ డిమాండ్
తాడ్వాయి, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): మేడారం ప్రాంత ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వ బ్యాంకు బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని టీడీపీ ములుగు నియోజకవర్గం ఇంచార్జి దారావత్ దేవా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మేడారం లో మాట్లాడుతూ, బ్యాంకు ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బయక్కపేట, కాల్వపల్లి, నార్లపూర్, వెంగ్లాపూర్, గోనేపల్లి గ్రామాల ప్రజలు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని గోవిందరావుపేటకు వెళ్లాల్సి వస్తోందని, కన్నెపల్లి, కొత్తూరు, ఊరట్టం, మేడారం గ్రామాల ప్రజలు తాడ్వాయి వెళ్లడం కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. మేడారం ప్రత్యేక మండలంగా మారితే భవిష్యత్తులో బ్యాంకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణమే బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై త్వరలో ములుగు కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. మేడారం లో బ్యాంకు ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు, మహిళలు, యువత కలసి స్పందించి సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.






