గ్యాస్ సరఫరా పారదర్శకంగా నిరంతరం కొనసాగాలి
రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
కాటారం, మార్చి17, (తెలంగాణ జ్యోతి): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం భూపాలపల్లిలోని హెచ్‌పీ గ్యాస్, సింగరేణి కాలరీస్‌కు చెందిన గ్యాస్ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, గ్యాస్ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఆయన వినియోగదారులకు సమయానికి గ్యాస్ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పాటించాలని సూచిస్తూ, గ్యాస్ సరఫరాలో ఎలాంటి జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఎల్పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్ సీక్వెన్స్‌ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్ రీఫిల్స్‌ను సరఫరా చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు. జిల్లాలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.ఈ తనిఖీ సందర్భంగా తనిఖీలో భాగంగా రోజువారీ బుకింగ్స్, డెలివరీస్, రీఫిల్ గ్యాస్ సరఫరా విధానాన్ని సమీక్షించారు. అదేవిధంగా జిల్లాలో గ్యాస్ నిల్వలు, బుకింగ్స్, ఆయిల్ కంపెనీల నుంచి రావాల్సిన సరఫరాపై పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






