ఏజెన్సీలో ఇసుక డీ-సెల్టింగ్ రద్దు చేయాలి: పూనెం ప్రతాప్
వెంకటాపురం, మార్చి17,తెలంగాణ జ్యోతి : ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న ఇసుక డీ-సెల్టింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆదివాసీలను ఏకం చేసి కొమరం భీం ఆదర్శంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ హెచ్చరించారు. మంగళవారం శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి ఎదిర గుట్టల సమీపంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చర్ల, వెంకటాపురం మండలాల పరిధిలోని సుబ్బంపేట, యకన్నగూడెం, ఎదిర, సూరవీడు, కొండాపురం, ఆలుబాక, రామచంద్రపురం తదితర ఆదివాసీ గ్రామాలకు ఈ విధానం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక డీ-సెల్టింగ్ కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోతూ వ్యవసాయం దెబ్బ తింటోందని, పంటలు సక్రమంగా పండడం లేదని తెలిపారు. కొత్త ఇసుక విధానం వల్ల ఆదివాసులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని, 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో పేసా చట్టానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని డిమాండ్ చేశారు. ఇసుక కొత్త పాలసీని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుగ్గ అరుణ్, పూనెం రవి కిరణ్, కోరం బన్నీ, బుగ్గ అశోక్ తదితరులు పాల్గొన్నారు.






