ఉపాధి హామీ పథకంతో రైతులకు భరోసా – ఎంపీడీవో రాజు
వెంకటాపూర్, ఫిబ్రవరి 7, (తెలంగాణ జ్యోతి): మొక్కలు పెంచుకునే రైతులకు మూడు సంవత్సరాల పాటు సంరక్షణకు కావాల్సిన భరోసాను ఉపాధి హామీ పథకం అందిస్తుందని ఎంపీడీవో మాలోత్ రాజు తెలిపారు. మండలంలోని రామానుజాపూర్ గ్రామంలో రైతు బైరెడ్డి భగవాన్ రెడ్డి హార్టికల్చర్ ద్వారా తీసుకున్న మామిడి మొక్కలను పెంచుతున్న తోటను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు తమ సొంత పొలాల్లో మామిడి, జామ, నిమ్మ, సపోట వంటి పండ్ల తోటలు నాటుకుని 2–3 సంవత్సరాల పాటు సంరక్షించుకునేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా వేతనం అందుతుందన్నారు. ఆసక్తిగల రైతులు ఎస్టిమేషన్ వేసుకుని సాంక్షన్ పొందాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా లభిస్తున్న అవకాశాలను రైతులు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, మామిడి మొక్కలు పెంచుతున్న రైతును అభినందించారు.






