తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్పై నిందలు
హైదరాబాద్,ఫిబ్రవరి3,తెలంగాణజ్యోతి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఆ వైఫల్యాలను దాచిపెట్టేందుకే బీఆర్ఎస్పై నిందలు మోపుతున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు గర్వకారణమైన గిరిజనుల మహా జాతరను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా పబ్లిసిటీ, రీల్స్లకే పరిమితమైందని ఆరోపించారు. గద్దెల వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడం, బస్సుల కొరతతో భక్తులు ఇబ్బందులు పడటం, ట్రాఫిక్ జామ్లను నివారించడంలో విఫలం కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. 15 రోజుల ముందే జాతర ప్రారంభమైందని ప్రచారం చేసి, కేబినెట్ సమావేశాల పేరుతో స్టంట్లు చేయడమే తప్ప కీలక సమయంలో నిర్వహణపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. చిన్న సమస్య వచ్చినా భారీ ట్రాఫిక్ అవుతుందని తెలిసినా ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం సర్కారు వైఫల్యమేనని స్పష్టం చేశారు. ప్రజల ఆగ్రహాన్ని బీఆర్ఎస్కు అంటగట్టడం కుటిల రాజకీయమని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్, కేటీఆర్ మేడారానికి ఎందుకు రాలేదంటూ చేస్తున్న ప్రచారం రాజకీయ ప్రాపగాండానేనని, ఒకవైపు సిట్ విచారణలతో ఇబ్బందులు పెట్టి మరోవైపు ఆహ్వానాల పేరుతో డ్రామాలు చేయడం సరికాదన్నారు. భక్తుల సౌకర్యాలపై చూపాల్సిన శ్రద్ధను పబ్లిసిటీపై చూపారని ప్రజలు గమని స్తున్నారని, తగిన సమయంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, వనదేవతల ఆశీర్వాదంతో నిజం వెలుగులోకి వస్తుందన్నారు.






